Bangladesh: నెలరోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రసవం... ముగ్గురు పిల్లలకు జననం
- బంగ్లాదేశ్లో చోటు చేసుకున్నఘటన
- వైద్య వర్గాల్లోనే ఆశ్చర్యం
- తల్లీబిడ్డలు క్షేమం
ఒకే ప్రసవంలో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు పుట్టడం విశేషం ఏమీ కాదు. అరుదైన సందర్భాల్లో ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుట్టిన సంఘటనలు కూడా చూశాం. కానీ ఒకసారి ప్రసవం జరిగిన నెల రోజుల తర్వాత మరోసారి ప్రసవించి పిల్లలకు జన్మనివ్వడం విశేషమే కదా. ఈ అరుదైన సంఘటన మన పొరుగుదేశం బంగ్లాదేశ్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఆ దేశంలోని జెస్సోరీ ప్రాంతానికి చెందిన అరిఫా సుల్తానా ఐతీ ఫిబ్రవరి 25న నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రసవం తర్వాత తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు ఇంటికి పంపించేశారు. అయితే, ఈ నెల 22న అరిఫాకు మరోసారి నొప్పులు రావడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు మరోసారి ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
ఆమెకు స్కానింగ్ చేసిన వైద్యులు కడుపులో మరో ఇద్దరు బిడ్డలు ఉండడంతో షాక్కు గురయ్యారు. వెంటనే ఆపరేషన్ చేసి వారిని బయటకు తీశారు. మొదటి బిడ్డకు జన్మనిచ్చిన 26 రోజులకు మరో ఇద్దరు కవలలు జన్మించారు. ‘అరిఫాకు రెండు గర్భాశయాలు ఉన్నాయి. ఇది అరుదు. తొలి కాన్పు సందర్భంగా వైద్యులు ఈ విషయాన్ని గమనించకపోవడంతో నెలరోజుల వ్యవధిలో ఆమె రెండుసార్లు ప్రసవించారు’ అని అరిఫాకు శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ షీలా తెలిపారు.