Pakistan: అక్కడ ఉగ్రశిబిరాలు లేవు...భారత్ ఇచ్చిన ఆధారాలపై పాక్ స్పందన ఇది
- 22 ప్రాంతాల్లో మా దర్యాప్తులో తేలింది ఇదే
- భారత్ చూస్తామన్నా చూపించేందుకు సిద్ధం
- పుల్వామా దాడి తర్వాత ఆధారాలు అందించిన భారత్
జమ్ముకశ్మీర్ రాష్ట్రం పుల్వామాలో ఉగ్రదాడుల అనంతరం పాకిస్థాన్‌లో నడుస్తున్న ఉగ్ర శిబిరాలపై భారత్ అందించిన ఆధారాలన్నీ ఉత్తివేనని పాకిస్థాన్ తోసిపుచ్చింది. భారత్ ఇచ్చిన జాబితాలో 54 మంది అనుమానితులను ప్రశ్నించామని, 22 ప్రాంతాలను పరిశీలించామని, ఉగ్ర శిబిరాలకు సంబంధించి ఒక్క ఆధారం కూడా లభించలేదని దాయాది దేశం వివరణ ఇచ్చింది.
దాడి అనంతరం తమ వద్ద ఉన్న ఆధారాలను పాకిస్థాన్ హైకమిషనర్‌కు భారత్ అందించింది. వీటిపై దర్యాప్తు నిర్వహించామని, అసలా ప్రాంతాల్లో అటువంటి శిబిరాలేవీ కనిపించలేదని పాకిస్థాన్ తెలిపింది. భారత్‌కు అనుమానం ఉండి చూస్తామంటే ఆ ప్రాంతాలను చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. చాలామందిని అదుపులోకి తీసుకుని విచారించామని, చాలామంది సోషల్ ఖాతాలను పరిశీలించామని, పుల్వామా దాడికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది.