Chandrababu: 31 కేసులున్న జగన్ ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో చర్యలు తీసుకుంటున్నారు, మేం చేస్తే పట్టించుకోరు: చంద్రబాబు ఆవేదన
- నార్త్ ఇండియన్ల సమావేశానికి హాజరైన ఏపీ సీఎం
- మోదీపై విమర్శలు
- వ్యవస్థలను నాశనం చేశారంటూ మండిపాటు
కేంద్రంతో విభేదించిన ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తాజాగా, రాష్ట్రంలో ఎస్పీల బదిలీ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. 31 కేసులున్న జగన్ లాంటి వ్యక్తి ఫిర్యాదు చేస్తే 24 గంటల్లోపే చర్యలు తీసుకుంటారని, తాము ఫిర్యాదు చేస్తే అస్సలు పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఆయన ఇవాళ విజయవాడలో నార్త్ ఇండియన్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు.
ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, మోదీ గత ఐదేళ్లుగా దేశంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, సీబీఐలో నాయకత్వం కోసం కొట్లాడుకోవడాన్ని అందరూ చూశారని, ప్రతి వ్యవస్థ కూడా దెబ్బతిన్నదని చెప్పారు. తమను ప్రశ్నించేవాళ్లను వేధించడం కోసం కేంద్రం సీబీఐ, ఈడీ వంటి యంత్రాంగాలను ఉపయోగించుకుంటోందని, ఐదేళ్లుగా అరవింద్ కేజ్రీవాల్ ఈ బాధలు పడ్డారని, తాము ఏడాది కాలం నుంచి ఈ తరహా సమస్యలు ఎదుర్కొంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఇదే జరిగిందని తెలిపారు. ఇతర పార్టీల నాయకులను లక్ష్యంగా చేసుకుని ఐటీ, ఈడీ దాడుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారని వివరించారు.
మోదీ ప్రతి ప్రజాస్వామ్య వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. తీవ్ర ఒత్తిడి కారణంగా ఆర్బీఐ గవర్నర్ తప్పుకోవాల్సి వచ్చిందని, టాప్ పోస్టు కోసం డైరక్టర్, జాయింట్ డైరక్టర్ కుమ్ములాడుకోవడం సీబీఐలో జరిగిందని తెలిపారు. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోదీ సమర్థ నాయకత్వాన్ని కాలరాస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. నాయకత్వం అనేది దేశానికి వరం లాంటిదని, అది రాజకీయ నాయకత్వమైనా, వ్యాపార నాయకత్వం అయినా, పాత్రికేయ నాయకత్వం అయినా కలిసికట్టుగా పనిచేసినప్పుడే ఏ వ్యవస్థ అయినా సజావుగా మనుగడ సాగించగలదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.