Andhra Pradesh: వైసీపీ నేతల ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్ కు వెళ్లిపోయింది.. ఓ గర్భిణిపై వైసీపీ నేతల దాడి అమానుషం!: చంద్రబాబు ఆగ్రహం
- రాబోయే 13 రోజులు అవిశ్రాంతంగా పనిచేయండి
- ఒత్తిడిలోనూ వీరోచితంగా పోరాడాలి
- కర్ణాటకలో ఐటీ దాడులు బీజేపీ వేధింపులకు పరాకాష్ట
రాబోయే 13 రోజులు టీడీపీ శ్రేణులు అవిశ్రాంతంగా పనిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఒత్తిడిలోనూ వీరోచితంగా పోరాడాలని సూచించారు. వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ బెదిరింపులకు దడుచుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. టీడీపీని ఎంతగా అణగదొక్కితే అంతగా విజృంభిస్తామని హెచ్చరించారు.
కర్ణాటక మంత్రులపై ఐటీ దాడులు నిర్వహించడం బీజేపీ వేధింపులకు పరాకాష్ట అని చంద్రబాబు మండిపడ్డారు. ఓటమి భయంతో బీజేపీ తప్పులమీద తప్పులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలు, సేవామిత్రలు, బూత్ కన్వీనర్లతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
వైసీపీ నేతల ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్ కు వెళ్లిపోయిందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ కు ఓటేస్తే నేరగాళ్లకు ఓటేసినట్లేనని హెచ్చరించారు. గాజువాకలో ఓ గర్భిణిపై వైసీపీ నేతలు దాడిచేయడం అమానుషమని వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలన్నా టీడీపీకే ఓటేయాలని కోరారు.