saravana bhavan: హత్య కేసులో 'శరవణ భవన్' అధినేతకు జీవిత ఖైదును విధించిన సుప్రీంకోర్టు
- మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
- జీవజ్యోతి భర్త హత్య కేసులో రాజగోపాల్ ను దోషిగా తేల్చిన కోర్టు
- 1999లో శాంతకుమార్ హత్య
ప్రఖ్యాత శరవణ భవన్ రెస్టారెంట్ అధినేత రాజగోపాల్ కు సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. ఆ సంస్థకు చెందిన ఉద్యోగిని రాజగోపాల్ తో పాటు మరో ఐదుగురు కలిసి హత్య చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు రాజగోపాల్ కు గతంలో జీవిత ఖైదును విధించింది. ఈ శిక్షను సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లినా... అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. మరోవైపు, ఇదే కేసులో 2009లో రాజగోపాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కేసు వివరాలలోకి వెళితే... 90వ దశకంలో చెన్నైలోని శరవణ బ్రాంచ్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి కుమార్తె జీవజ్యోతిని రాజగోపాల్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అప్పటికే రాజగోపాల్ కు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో పెళ్లికి జీవజ్యోతి ఒప్పుకోలేదు. 1999లో శాంతకుమార్ అనే వ్యక్తిని జీవజ్యోతి పెళ్లాడింది.
వివాహబంధాన్ని తెగదెంపులు చేసుకోవాలంటూ భార్యాభర్తలను రాజగోపాల్ హెచ్చరించినట్టు ప్రాసిక్యూషన్ వాదించింది. రాజగోపాల్ తో పాటు అతనికి సంబంధించిన వ్యక్తులు తమను బెదిరిస్తున్నారంటూ 2001లో జీవజ్యోతి, శాంతకుమార్ లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే శాంతకుమార్ ను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతని శవం కొడైకెనాల్ అడవుల్లో దొరికింది.
చైన్ రెస్టారెంట్ గా శరవణ భవన్ కు ఎంతో పేరు ఉంది. దాదాపు 20 దేశాల్లో దీనికి ఔట్ లెట్లు ఉన్నాయి. ఇండియాలో 25 రెస్టారెంట్లు ఉన్నాయి.