kodali nani: తిన్నింటి వాసాలను లెక్కపెట్టే వ్యక్తి.. ఇలాంటి దుర్మార్గుడు మనకు అవసరమా?: కొడాలి నానిపై చంద్రబాబు ధ్వజం
- మీకెవరికైనా ఒక పనైనా చేశాడా?
- ఎన్నికల సమయంలో మూటలతో వస్తాడు
- ఇలాంటి వ్యక్తిని చిత్తుచిత్తుగా ఓడించండి
కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్నికల ప్రచారం సందర్భంగా వైసీపీ అభ్యర్థి కొడాలి నానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ వ్యక్తి ఏ పార్టీలో పుట్టారు? ఇప్పుడు ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. తనకంటే పెద్ద మాటలు మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నైజం ఉన్నవాడంటూ ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి దుర్మార్గుడుని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
మీకెవరికైనా ఈ వ్యక్తి ఒక్క పనైనా చేశారా? అని సభకు హాజరైన ప్రజలను ప్రశ్నించారు. మామూలు సమయంలో కనపడడని, ఎన్నికల సమయంలో మూటలతో వస్తాడని ఎద్దేవా చేశారు. ఓట్లు కొని, ఆ తర్వాత వ్యాపారాలు చూసుకుంటాడని అన్నారు. ఇలాంటి వలస పక్షులు మనకు అవసరం లేదని చెప్పారు.
టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్ ఇక్కడే ఇల్లు కొనుక్కుని, ఇక్కడే స్థిరపడ్డాడని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు కుల ప్రస్తావనలు తెస్తున్నారని... కేఈ, కోట్ల కుటుంబాలను తాను కలిపానని... ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలను కలిపానని... పరిటాల రవి, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాలను కలిపానని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కలవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈరోజు కాపులకు రిజర్వేషన్లు ఇచ్చింది తాను కాదా? అని ప్రశ్నించారు. కాపులకు రూ. 5వేల కోట్లు ఇచ్చానని... వారిని ఓట్లు అడిగే హక్కు తనకు మాత్రమే ఉందని చెప్పారు. తనది ప్రజాకులమని అన్నారు.