Narendra Modi: చంద్రబాబు 'స్టిక్కర్ బాబు' ఎలా అయ్యాడో చెప్పిన ప్రధాని మోదీ
- కేంద్ర పథకాలను తమవిగా చెప్పుకుంటున్నారు
- స్టిక్కర్లు అతికించి ప్రజలకు అందిస్తున్నారు
- కర్నూలు సభలో ప్రధాని ప్రసంగం
ఎక్కడైనా పథకాల అమలులో కుంభకోణాలు జరగడం సాధారణ విషయం, కానీ ఇక్కడ కుంభకోణాలు చేయడం కోసమే పథకాలు పుట్టిస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఏ పథకాలైతే రాష్ట్ర అభివృద్ది కోసం రూపొందించారో వాటన్నింటిలో అవినీతి రాజ్యమేలుతోందని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం నుంచి ప్రతి పథకం కూడా అవినీతిమయం అయిందని అన్నారు. కర్నూలులో ఇవాళ జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఏపీ ప్రభుత్వంపై పరోక్ష వ్యాఖ్యలతో హోరెత్తించారు.
రాష్ట్రానికి తాము కేటాయించిన నిధులకు లెక్కచెప్పమని అడిగినప్పటి నుంచి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ఇచ్చిన డబ్బుకు లెక్క చెప్పమంటే చంద్రబాబు యూటర్న్ బాబుగా మారిపోయాడని విమర్శించారు. "దేశం మొత్తమ్మీద పొద్దున, సాయంత్రం కోర్టుల చుట్టూ తిరిగేవాళ్లతో జత కలిసి నన్ను ఓడించడానికి యూటర్న్ బాబు ప్రయత్నిస్తున్నారు. ఈ దేశం, ఈ రాష్ట్రం కోసం కాకుండా, వాళ్లు మాట్లాడే మాటలతో ఎక్కడో ఉన్న పాకిస్థాన్ లో హీరోలు కావాలని కోరుకుంటున్నారు. తన రాజకీయ స్వార్థం కోసం, తన అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి యూటర్న్ తీసుకున్న చంద్రబాబు అబద్ధాల కోటలు కడుతూ, అబద్ధాలతోనే బతుకుతున్నారు. కేంద్రం నుంచి వస్తున్న పథకాలకు వారి స్టిక్కర్లు తగిలించి ప్రజలకు అందిస్తున్నారు. తమవిగా చెప్పుకుంటున్నారు. అందుకే ఆయన స్టిక్కర్ బాబు అయ్యాడు, యూటర్న్ బాబు అయ్యాడు" అంటూ మండిపడ్డారు.