Tirumala: తిరుమల శేషాచలం అడవుల్లో విస్తరిస్తున్న కార్చిచ్చు: శ్రీవారి పాదాల వద్దకు మంటలు
- కాలిబూడిదవుతున్న అటవీ ప్రాంతం
- విలువైన కలప అగ్నికి ఆహుతి
- ఘటనా స్థలి ప్రభుత్వ అధీన ప్రాంతం
తిరుమల గిరులపై ఉన్న శేషాచలం కొండల్లో కార్చిచ్చు విస్తరిస్తోంది. ఎగసిపడుతున్న మంటలు శ్రీవారి పాదాల సమీపంలోకి వచ్చేయడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. భారీ ఎత్తున అటవీ ప్రాంతం తగలబడుతుండడంతో విలువైన వృక్షసంపద అగ్నికి ఆహుతి అవుతోంది. బాకరాపేట రేంజ్‌లోని చామలకోన అడవుల్లో గురువారం మొదలైన కార్చిచ్చు 24 గంటలుగా విస్తరిస్తూనే ఉంది.
శనివారం ఉదయానికి ధర్మగిరి ప్రాంతంలోని గాడికోన వద్ద అటవీ ప్రాంతంలోకి మంటలు విస్తరించాయి. శుక్రవారం ఉదయం నుంచి మంటలను అదుపులోకి తెచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ప్రయత్నిస్తూనే ఉన్నా అదుపులోకి రావడం లేదు. ఇప్పటికే శ్రీవారి పాదాలవైపు, రిజర్వ్ ఫారెస్టు వైపు ప్రాంతంలోకి మంటలు పాకాయి. ప్రస్తుతం తగలబడుతున్న ప్రాంతం అంతా ప్రభుత్వ అధీనంలోనిదేనని అధికార వర్గాలు తెలిపాయి.