Kurnool District: ఐదేళ్ల పాలనలో అత్యధిక ధనిక సీఎంలలో ఒకరిగా చంద్రబాబు మారారు: వైఎస్ జగన్
- బాబు బాగుంటే, రాష్ట్రం బాగున్నట్టేనా?
- కర్నూలు జిల్లాలో మొదటి పంటకు సాగునీరు లేదు
- ఈ ఐదేళ్లలో నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయింది
ఐదేళ్ల పాలన తర్వాత దేశంలో అత్యధిక ధనిక సీఎంలలో ఒకరిగా చంద్రబాబు మారారని, బాబు బాగుంటే, రాష్ట్రం బాగున్నట్టేనా? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, కర్నూలు జిల్లాలో మొదటి పంటకు సాగు నీరివ్వడం లేదని, ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న హామీలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నెరవేర్చలేదని విమర్శించారు.
ఈ ఐదేళ్లలో నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయిందని, ఇక్కడి రైతు దేశంలోనే అత్యంత పేదవాడిగా ఉన్నాడని, డ్వాక్రా మహిళల రుణాలు తడిసి మోపెడయ్యాయని విమర్శించారు. చంద్రబాబు తన కొడుకుకి ఎమ్మెల్సీగా ఉద్యోగం ఇచ్చాడని, ఆ తర్వాత మంత్రిగా ప్రమోషన్ చేశాడే తప్ప నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదని విమర్శించారు. ‘మీ భవిష్యత్ నా భరోసా’ అంటూ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.