Andhra Pradesh: మంగళగిరి టూర్.. మగ్గం గుంటలో దిగి చీర నేసిన ఏపీ మంత్రి నారా లోకేశ్!
- చేనేతకు అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పిస్తాం
- బకాయిల విడుదలకు చర్యలు తీసుకుంటాం
- చేనేత వస్త్రాల వినియోగం పెరిగేలా చూస్తామన్న లోకేశ్
మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పిస్తామని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏపీ బడ్జెట్ లో రూ.250 కోట్లతో చేనేత మార్కెటింగ్ నిధిని ఏర్పాటుచేయడంతో పాటు చేనేత వస్త్రాల వినియోగం పెరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని రత్నాలచెరువులో టీడీపీ లోక్ సభ అభ్యర్థి గల్లా జయదేవ్ తో కలిసి లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అప్కో పెండింగ్ బకాయిల సత్వర విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేనేత కుటుంబాలకు ఉచిత ఆరోగ్య బీమా, పిల్లలకు మోడల్ పాఠశాలలతో పాటు అంతర్జాతీయ స్థాయి టెక్స్ టైల్ లెర్నింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. పర్యటనలో భాగంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ మగ్గం గుంటలోకి దిగిన లోకేశ్ కొద్దిసేపు చీరను నేశారు. చేనేత కార్మికులను అన్నిరకాలుగా ఆదుకుంటామనీ, ఈసారి ఎన్నికల్లో టీడీపీకి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.