Prakash Raj: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పేరిట నాలుగు ఓట్లు ఉన్నాయంటూ ఈసీకి ఫిర్యాదు
- మూడు రాష్ట్రాల్లో ఓట్లున్నాయి
- చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి
- ఈసీని కలిసిన బీజేపీ నేత గిరీష్ కుమార్
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బహుముఖ ప్రజ్ఞావంతుడన్న సంగతి తెలిసిందే. నటన, రచన, దర్శకత్వం మాత్రమే కాదు సామాజిక చైతన్యం కూడా ఆయనలో మరో కోణంగా చెప్పుకోవాలి. అయితే, కొంతకాలంగా బీజేపీ శ్రేణులతో అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రకాశ్ రాజ్, ఈ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా లోక్ సభకు పోటీచేస్తున్నారు. పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య జరిగినప్పటి నుంచి బీజేపీ నేతలంటేనే ప్రకాశ్ రాజ్ మండిపడుతున్నారు. సందర్భం వచ్చినప్పుడలా వారిని ఇరుకున పడేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయితే, అదను చూసి రంగంలోకి దిగిన బీజేపీ కార్యకర్తలు ప్రకాశ్ రాజ్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయనకు మూడు రాష్ట్రాల్లో నాలుగు ఓట్లున్నాయంటూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీ కర్ణాటక విభాగం కార్యవర్గ సభ్యుడు గిరీష్ కుమార్ ఈ మేరకు ఈసీని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రకాశ్ రాజ్ కు తమిళనాడులో 2, తెలంగాణలో 1, బెంగళూరు శాంతి నగర్ లో ఒక ఓటు ఉన్నట్టు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని, కానీ ప్రకాశ్ రాజ్ ఏకంగా 4 ఓట్లు కలిగి ఉన్నారని గిరీష్ కుమార్ తెలిపారు.