Arjun Charan Sethi: బీజేపీలో చేరిన బీజేడీ సీనియర్ నేత సేథి!
- నవీన్ పట్నాయక్‌కు లేఖ రాసిన సేథి
- నా కుమారుడికి సీటు ఇవ్వాలని కోరాను
- ఇస్తానని హామీ ఇచ్చారు
- తుది జాబితాలో పేరు తొలగించారు
ఆరు సార్లు ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఒడిసా బీజేడీ సీనియర్ నేత అర్జున్ చరణ్ సేథి నేడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు కారణాలను వెల్లడిస్తూ ఆయన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు లేఖ రాశారు. వయోభారం కారణంగా తనకు బదులు, తన కుమారుడికి లోక్‌సభ సీటు ఇవ్వాలని కోరానని, సరేనని హామీ ఇచ్చి, తుది జాబితాలో తన కుమారుడి పేరును తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
నవీన్‌ని కలుద్దామని వెళ్లి, ఆయన నివాసం వద్ద గంటల తరబడి నిరీక్షించానని, కానీ కొందరు నేతలు తనను అడ్డుకున్నారని వాపోయారు. బీజేడీకి ఇక తన అవసరం లేదని, వృద్ధాప్యంలో ఇది తనకో గట్టి షాక్ అని సేథి లేఖలో పేర్కొన్నారు. కాగా సేథి నేడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రథాన్ సమక్షంలో బీజేపీలో చేరారు.