Indigo: విశాఖ నుంచి పలు విమాన సర్వీసులను రద్దు చేసిన ఇండిగో సంస్థ
- వేసవి రద్దీ పెరిగే సమయంలో నిర్ణయంతో ఆశ్చర్యం
- నేటి నుంచే అమల్లోకి నిర్ణయం
- ప్రయాణికులపై తీవ్ర ప్రభావం అన్న అభిప్రాయం
వేసవి సెలవుల కాలం సమీపిస్తోంది. పర్యాటక సీజన్ ప్రారంభమవుతుంది. చూడదగ్గ ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లేవారి సంఖ్య పెరగనుంది. ఇటువంటి సమయంలో సర్వీసులను పెంచాల్సింది పోయి ఉన్న సర్వీసుల్లో కోత విధించి ఆశ్చర్యపరిచింది ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’. నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నగరం నుంచి ప్రధాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆదివారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుందని ప్రకటించింది. కోల్కతా-విశాఖ (సర్వీసు నెంబరు 6ఈ833), విశాఖ-కోల్కతా (6ఈ886), బెంగళూరు-విశాఖ (6ఈ622), విశాఖ-బెంగళూరు (6ఈ647) సర్వీసులను పూర్తిగా రద్దుచేసింది.
చెన్నై నుంచి విశాఖ, భువనేశ్వర్ మీదుగా కోల్కతాకు వెళ్లాల్సిన సర్వీసు (6ఈ557)లో భువనేశ్వర్ స్టాప్ ను ఎత్తేసింది. ఈ విమానం విశాఖ నుంచి నేరుగా భువనేశ్వర్ వెళ్లనుంది. తిరుగు ప్రయాణంలోనూ (6ఈ512) కోల్కతా నుంచి నేరుగా విశాఖకు వచ్చేలా చేశారు. దీంతో విశాఖ - భువనేశ్వర్ సేవలు ఆగిపోయినట్టే. ఈ నిర్ణయం ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపనుంది.