Andhra Pradesh: గతంలో టీడీపీ నేత గౌతు శివాజీ తన మనుషులతో నాపై దాడి చేయించారు!: పవన్ కల్యాణ్ ఆరోపణ
- ఉత్తరాంధ్ర అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉంది
- నదుల అనుసంధానానికి మద్దతు ఇస్తున్నాం
- శ్రీకాకుళం జిల్లా పలాసలో జనసేన పోరాటయాత్ర
ఉత్తరాంధ్ర అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఉత్తరాంధ్రను ఉత్తమఆంధ్రాగా మారుస్తామని ధీమా ఇచ్చారు. శ్రీకాకుళంలో 16 నదులు ఉన్నప్పటికీ తాగునీరు లేకుండా ఇబ్బందిపడుతున్నారని వ్యాఖ్యానించారు.
తాను ముఖ్యమంత్రి కాగానే ఒడిశా సీఎంతో మాట్లాడి ఉత్తరాంధ్రలో 10 లక్షల ఎకరాలకు సాగునీటిని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. నదుల అనుసంధానానికి జనసేన మద్దతు తెలుపుతోందన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈరోజు నిర్వహించిన జనసేన పోరాట యాత్రలో పవన్ ప్రసంగించారు.
పండే పంటల ఆధారంగా ప్రత్యేక మండలాలను ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఉత్తరాంధ్రను రాయలసీమతో సమానంగా పరిగణించి అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఇక్కడి కళింగపట్నం పోర్టును వాడకంలోకి తీసుకొస్తామన్నారు. అలాగే మత్స్యకారులకు జెట్టీలు నిర్మించి ఇస్తామన్నారు.
ఉత్తరాంధ్ర నుంచి గరిమెళ్ల, గురజాడ, ఘంటశాల, సుశీల వంటి హేమాహేమీలు పుట్టారని పవన్ అన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర కల్చరల్ అకాడమీని ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా భాష, యాసలో రచనలు చేసేవారికి పారితోషకం, ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పలాసలోని గిరిజనులకు న్యాయం చేస్తామన్నారు. అలాగే ప్రతీ మండలానికి ఓ ఆసుపత్రిని కడతామన్నారు.
గతంలో గౌతు శివాజీ కుటుంబీకులు మనుషులను పంపించి తనపై పలాసలో దాడిచేయించారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఇచ్ఛాపురం పర్యటనను టీడీపీ నాయకులు అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. ఓవైపు టీడీపీ నేతలు దాడులు చేస్తుంటే.. మరోవైపు తాను చంద్రబాబు పార్టనర్ అని జగన్ విమర్శిస్తూ ఉంటారని దుయ్యబట్టారు. ఏపీలో నారా కుటుంబం, వైఎస్ కుటుంబం మాత్రమే ఉండాలనుకుంటే మార్పు సాధ్యం కాదన్నారు.