Mahabubnagar: మే 23 తర్వాత ఈ దేశంలో పగ్గాలు చేపట్టేది ప్రాంతీయ పార్టీల కూటమే: సీఎం కేసీఆర్
- కాంగ్రెస్, బీజేపీ కలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేవు
- బీజేపీ మా భరతం పట్టడం కాదు మేమే పడతాం
- ప్రధాని స్థాయి వ్యక్తి నాపై వ్యక్తిగత కామెంట్లు చేస్తారా?
కాంగ్రెస్, బీజేపీ కలిసినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని, మే 23 తర్వాత ఈ దేశంలో పగ్గాలు చేపట్టేది ప్రాంతీయ పార్టీల కూటమినే అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ తమ భరతం పట్టడం కాదు, తామే బీజేపీ భరతం పడతామని అన్నారు. ‘ఒక ప్రధాని స్థాయి వ్యక్తి నాపై వ్యక్తిగత కామెంట్లు చేస్తారా? నాకు జాతకాల పిచ్చి ఉంటే మోదీకి ఎందుకు?’ అని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్, బీజేపీలు తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడానికి గల కారణమేంటంటే, తాను జాతీయ రాజకీయాల్లోకి వెళితే ఢిల్లీలో వారి పీఠాలు కదులుతాయని భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని, దేశాన్ని అభివృద్ధి చేసే తెలివి ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. దేశం దరిద్రం పోవాలంటే ఎవరో ఒకరు నడుం కట్టాలని, అందుకోసం, అవసరమైతే ఓ జాతీయ పార్టీని స్థాపిస్తానని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలు ఆశీర్వదించి పంపిస్తే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తానని కేసీఆర్ అన్నారు.