Rajamahendravaram: యు-టర్న్ బాబుకు ‘పోలవరం’ ఓ ఏటీఎంలా మారింది: చంద్రబాబుపై మోదీ విమర్శలు
- ‘పోలవరం’ పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఏపీకి లేదు
- కేంద్రం నిధులు మంజూరు చేసినా పూర్తి చేయలేదు
- బాబు పరిస్థితి ‘బాహుబలి’లో భల్లాలదేవుడిలా ఉంది
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రధాని మోదీ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, యు-టర్న్ బాబుకు పోలవరం ప్రాజెక్టు ఓ ఏటీఎంలా మారిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. చంద్రబాబు పాలన అధర్మం, అన్యాయంగా మారిందని, మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన మాటలను ఏపీ ప్రజలు ఎప్పటికీ నమ్మరని విమర్శించారు.
యు-టర్న్ బాబు పరిస్థితి ‘బాహుబలి’ సినిమాలో భల్లాలదేవుడిలా ఉందని మోదీ సెటైర్లు విసిరారు. తాము అధికారంలోకి వచ్చాక తొలి కేబినెట్ భేటీలోనే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని, ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ.7 వేల కోట్లు విడుదల చేశామని స్పష్టం చేశారు. కేంద్రం నిధులు మంజూరు చేసినా ఇక్కడి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు. ‘పోలవరం’ అంచనా వ్యయాలు క్రమంగా పెరుగుతూ పోతున్నాయని అన్నారు.