Telangana: మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగలు: రాహుల్ గాంధీ

  • మోదీని ఓడించి తీరుతాం.. ఢిల్లీ గద్దెనెక్కుతాం
  • అధికారంలోకి రాగానే ‘న్యాయ్’ పథకం అమలు చేస్తాం
  • నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితుల సమస్యలను పరిష్కరిస్తాం

తెలంగాణ రాష్ట్రంలో కుటుంబపాలన నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని, మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలను నరేంద్ర మోదీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న మోదీని ఓడించి తీరుతామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకువస్తే పేదరిక నిర్మూలనకు పాటుపడతామని, వరి పండించే రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని, వ్యవసాయ క్షేత్రాలకు సమీపంలోనే గోదాములు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్న నీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉందని, దీంతో, ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తనకు తెలుసని అన్నారు. ఈనాటికీ ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య అలానే ఉందని, నల్గొండ వాసులకు శుద్ధమైన మంచినీటిని ఇస్తామని చెప్పిన కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే ఫ్లోరైడ్ బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ పీఠంపై కాంగ్రెస్ ఉంటే పేదలకు ‘న్యాయ్’ పథకం అమలు చేసి తీరతామని మరోసారి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News