KCR: కేసీఆర్ చక్రం తిప్పే వరకు జగన్ ఊరుకుంటారా?: విజయశాంతి
- 16 సీట్లు గెలిచి కేసీఆర్ చక్రం తిప్పితే 22 సీట్లు గెలుస్తానంటున్న జగన్ ఏం తిప్పాలి?
- ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీలను కేసీఆర్ ఎలా శాసిస్తారు?
- కేసీఆర్ సారు.. ప్రధాని కారంటూ ఎద్దేవా
కేసీఆర్ 16 సీట్లకే ఎగిరెగిరి పడుతుంటే 22 లోక్సభ స్థానాలు గెలుస్తానంటున్న జగన్ పరిస్థితి ఏంటని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ప్రశ్నించారు. 16 సీట్లు గెలిస్తేనే కేంద్రంలో చక్రం తిప్పేస్తామని కేసీఆర్ చెబుతున్నారని, మరి అలా అయితే 22 సీట్లు గెలుస్తానంటున్న జగన్ ఏం తిప్పాలని కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచార నినాదమైన ‘సారు, కారు, సర్కారు’ను విజయశాంతి ప్రస్తావిస్తూ.. ‘కేసీఆర్ సారు.. ప్రధాని ‘కారు’’ అని ఎద్దేవా చేశారు.
తక్కువ సీట్లు గెలిచిన పార్టీ ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీలను ఎలా శాసిస్తుందని విజయశాంతి ప్రశ్నించారు. కేసీఆర్ చక్రం తిప్పేదాకా జగన్ ఊరుకుంటారా? అని నిలదీశారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రశ్నలకు దొరకని సమాధానమేనని విమర్శించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ‘న్యాయ్’ పథకాన్ని ప్రకటించి హీరో అయ్యారని, నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రధాని మోదీ జీరో అయ్యారని విజయశాంతి పేర్కొన్నారు.