Andhra Pradesh: చిత్తూరులో చంద్రబాబు హామీల జల్లు.. ఉద్వేగంగా మాట్లాడిన సీఎం
- మీకోసం రాత్రీపగలు కష్టపడుతున్నా
- ఏడాదికి రెండు పండుగలకు గ్యాస్ సిలిండర్లు
- ఇంటర్ విద్యార్థులకూ నిరుద్యోగ భృతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహిళలపై హామీల జల్లు కురిపించారు. నిన్న చిత్తూరు జిల్లా చంద్రగిరి, మదనపల్లె, పుత్తూరు, నెల్లూరు జిల్లా ముత్తుకూరు, నెల్లూరు రూరల్, సిటీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు. ఈ సందర్భంగా కాస్త ఉద్వేగంగా మాట్లాడారు. తాను కష్టపడుతున్నది మీకోసమేనని, తాను బతికేది కూడా మీకోసమేనని అన్నారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం రాత్రింబవళ్లూ కష్టపడతానని చెప్పారు.
ఆడపడుచుల కోసం ఎంతో చేశానన్న చంద్రబాబు వారికి ఇంకా ఏమైనా చేయాలని ఉందని అన్నారు. ప్రతి ఏటా రెండు పండుగలకు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తానని, వీలైతే అన్ని పండుగలకు ఇస్తానని హామీ ఇచ్చారు. మహిళలకు సంపాదనగా మార్గాలు నేర్పిస్తానని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడతానని అన్నారు. ‘యువనేస్తం’ భృతిని మూడు వేల రూపాయలకు పెంచుతానని, ఇంటర్ చదివిన విద్యార్థులకూ దీనిని వర్తింపజేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రైతులకు ఇప్పుడిస్తున్న 9 గంటల విద్యుత్తును 12 గంటలకు పెంచుతానని భరోసా ఇచ్చారు.