Mayawati: నేను వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడానికి కారణమదే: సుప్రీంకోర్టుకు చెప్పిన మాయావతి!
- నిరుపేదల కోసం జీవితాన్ని త్యాగం చేశాను
- దళిత మహిళ గౌరవార్థం ప్రజలే విగ్రహాలు కావాలని కోరారు
- సుప్రీంలో దాఖలు చేసిన అఫిడవిట్ లో మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయారన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో తాను ఎందుకు వివాహం చేసుకోలేదన్న విషయాన్ని వివరించారు. యూపీలో ఏర్పాటైన మాయావతి విగ్రహాలపై ఓ న్యాయవాది అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ, బీఎస్పీ అధికారంలో ఉన్న వేళ, వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఆరోపించగా, మాయావతి స్పందించారు.
ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి, అధికారం చెలాయిస్తున్న పాలకుల నుంచి ప్రజలకు విముక్తిని కలిగించాలని తాను చాలా సంవత్సరాల క్రితమే నిర్ణయించుకున్నానని చెప్పారు. ప్రజల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేశానని, అందుకే వివాహం చేసుకోలేదని స్పష్టం చేశారు. పేదల కోసం తన వైవాహిక జీవితాన్ని పక్కన పెట్టిన ఓ దళితమహిళ గౌరవార్థం ప్రజలే స్వయంగా విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారని, అందుకే విగ్రహాలు పెట్టించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ విగ్రహాలు రాష్ట్ర ప్రభుత్వానికి పర్యాటకంగా ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయని స్పష్టం చేశారు. కాగా, ఈ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఫిబ్రవరి నుంచి విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.