Gurugram: రూ. 3 కోట్ల కారు కోసం... కిడ్నాప్ డ్రామా ఆడిన ఇంటర్ విద్యార్థి!
- 29న క్రికెట్ ఆడేందుకు వెళ్లి ఇంటికి రాని సందీప్ కుమార్
- కిడ్నాప్ డ్రామాగా తేల్చిన పోలీసులు
- గురుగ్రామ్ లో ఘటన
ఇంటర్ చదువుతున్న ఓ కుర్రాడు, రూ. 3 కోట్ల విలువైన హై ఎండ్ కారుపై కన్నేసి, దాన్ని కొనేందుకు అవసరమైన డబ్బు కోసం స్వీయ కిడ్నాప్ డ్రామా ఆడాడు. ఈ ఘటన గురుగ్రామ్ లో జరిగింది. ఇక్కడి కృష్ణా కాలనీలో నివాసం ఉండే సందీప్ కుమార్ అనే విద్యార్థి, గత నెల 29న క్రికెట్ అకాడమీకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీనిపై అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
"కేసును మేము విచారిస్తున్న సమయంలో, తన సోదరుడు నవీన్ కుమార్ కు తప్పుడు కాల్ చేసి, డబ్బు డిమాండ్ చేయాలని కోరుతూ సందీప్ రూ. 500 ఓ వ్యక్తికి ఇచ్చినట్టు తెలిసింది. భీవండీ ప్రాంతంలో రెండు రోజులు ఉన్న అతను, తన మోటార్ సైకిల్ ను సెక్టార్ 5లోని ఓ దేవాలయం వద్ద వదలి వెళ్లాడు. తిరిగి గురుగ్రామ్ కు రాగా, అప్పటికే అతని తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చివుండటంతో, ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గుర్తు పట్టి, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు" అని గురుగ్రామ్ పోలీస్ పీఆర్వో సుభాష్ బోకన్ వెల్లడించారు.
అతన్ని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు వచ్చాయని, తాను అపస్మారక స్థితిలో పడిపోయానని చెప్పాడని, అతని మాటలను నమ్మని పోలీసులు, క్రైమ్ స్పాట్ కు తీసుకెళ్లగా, అక్కడ సందీప్ చెప్పినట్టుగా కిడ్నాప్ జరిగిన ఆనవాళ్లు లభించలేదని తెలిపారు. గట్టిగా ప్రశ్నించడంతో, హై ఎండ్ కారు కొనేందుకు డబ్బు కోసం ఈ డ్రామా ఆడినట్టు వెల్లడించాడని అన్నారు. అతన్ని గట్టిగా మందలించి పంపామని తెలిపారు.