Uttar Pradesh: సినిమా టికెట్లు క్యాన్సిల్ చేసుకున్న యువతి నుంచి 40 వేలు కొట్టేశారు!
- యూపీలో ఘటన
- డబ్బు తిరిగిస్తామంటూ కార్డు వివరాలు తెలుసుకున్న వ్యక్తి
- ఆపై నిమిషాల్లో డబ్బు మాయం
సినిమాకు టికెట్లను బుక్ చేసుకుని, ఆపై వాటిని క్యాన్సిల్ చేసుకున్న ఓ యువతి నుంచి రూ. 40 వేలు కొట్టేశారు కేటుగాళ్లు. ఈ ఘటన యూపీ రాజధాని లక్నో పరిధిలోని జానకీపురంలో జరిగింది. బాధితురాలు, పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, ఓ యువతి ఆన్ లైన్ లో మూవీ టికెట్లను బుక్ చేసుకుంది. ఆపై సినిమాకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాటిని క్యాన్సిల్ చేసుకుంది.
అయితే, ఆ డబ్బు తిరిగి ఆమె ఖాతాకు జమ కాకపోవడంతో, కస్టమర్ కేర్ కు ఫోన్ చేసింది. వారు డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఆపై కొన్ని రోజులకు తాను టికెట్ బుకింగ్ వెబ్ సైట్ నుంచి మాట్లాడుతున్నానంటూ, ఫోన్ చేసిన వ్యక్తి, డబ్బులు తిరిగి ఎకౌంట్ లో జమ చేయడానికి డెబిట్ కార్డు వివరాలు కావాలని కోరడంతో, ఆమె వాటిని చెప్పింది. ఆపై నిమిషాల్లోనే సదరు యువతి బ్యాంకు ఖాతా నుంచి రూ. 40 వేలు ఎగిరిపోయాయి.
దీంతో ఆమె తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు. ఎవరు ఫోన్ చేసినా బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు, వాటికి అటాచ్ అయివున్న ఫోన్ నంబర్లను చెప్పరాదని ఉన్నతాధికారి ఒకరు హెచ్చరించారు.