BJP: థాకరేను విమర్శించి మూల్యం చెల్లించుకున్న బీజేపీ సిట్టింగ్ ఎంపీ.. టికెట్ నిరాకరించిన బీజేపీ అధిష్ఠానం
- గత ఎన్నికల్లో 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన కిరీట్ సోమయ
- ఉద్ధవ్ థాకరే విమర్శలను ఘాటుగా తిప్పికొట్టిన సిట్టింగ్ ఎంపీ
- థాకరే సూచనతో తమ నేతకు టికెట్ నిరాకరించిన బీజేపీ
శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేను విమర్శించిన బీజేపీ సిట్టింగ్ ఎంపీ కిరీట్ సోమయ (65)కు బీజేపీ అధిష్ఠానం టికెట్ నిరాకరించింది. ముంబై నార్త్ఈస్ట్ నుంచి సోమయ రెండుసార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో మూడు లక్షలకు పైగా ఓట్లతో మెజారిటీ సాధించిన ఆయనకు ఈసారి టికెట్ గల్లంతు కావడం చర్చనీయాంశమైంది.
మహారాష్ట్రలోని బీజేపీ సిట్టింగ్ ఎంపీల్లో కిరీట్కే టికెట్ దక్కకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో శివసేన-బీజేపీ కలిసి పోటీ చేశాయి. అయితే, ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో బీజేపీకి శివసేన దూరమైంది. ఈ క్రమంలో బీజేపీపై శివసేన తీవ్ర విమర్శలు చేసింది. థాకరే విమర్శించిన ప్రతిసారి కిరీట్ రంగంలోకి దిగి కౌంటరిచ్చేవారు.
తాజా ఎన్నికల నేపథ్యంలో శివసేన-బీజేపీ మరోసారి కలిసి పోటీ చేస్తున్నాయి. రెండు పార్టీలు ఒక్కటైనా ఉద్ధవ్ థాకరే మాత్రం తనను విమర్శించిన కిరీట్ను మర్చిపోలేదు. ఆయనకు టికెట్ ఇవ్వొద్దన్న షరతు బీజేపీ ముందు పెట్టినట్టు సమాచారం. శివసేన ఒత్తిడితోనే కిరీట్కు బీజేపీ అధిష్ఠానం టికెట్ నిరాకరించిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సోమయ శివసేన చీఫ్‌తో సమావేశానికి ప్రయత్నించి రాజీమార్గాల కోసం చూసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయనను కలిసేందుకు ఉద్ధవ్ నిరాకరించారు.