Vijay Malya: విజయ్ మాల్యా జల్సాలకు బ్రేక్... పది రోజుల ఖర్చుతో నెలంతా గడపాల్సిందే!
- ఒకప్పుడు అత్యంత లగ్జరీ జీవితం
- ఇప్పుడు వారానికి 18,300 పౌండ్ల ఖర్చు
- దాన్ని నెలకు 29,500 పౌండ్లకు తగ్గింపు
- మాల్యా అంగీకరించారన్న న్యాయవాది
ఒకప్పుడు సొంత విమానాలు, చుట్టూ సెలబ్రిటీలు, నిత్యమూ లగ్జరీ లైఫ్ ను అనుభవించి, ఆపై ఇండియాలో బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టి, లండన్ కు పారిపోయి, ఎన్నో కేసులను ఎదుర్కొంటున్న యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా జల్సాలకు మరింత బ్రేక్ పడనుంది. ఆయన ఇంకా లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తున్నాడని బ్రిటన్ కోర్టుకు తెలిపిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాల్యా నిర్వహిస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్ యూకే పీఎల్సీ ఖాతా నుంచి 2,58,000 పౌండ్లను సీజ్ చేసేందుకు అనుమతించాలని కోరింది.
ఇదే సమయంలో మాల్యా తరఫు న్యాయవాది మాట్లాడుతూ, తన క్లయింట్ ప్రస్తుతం వారానికి 18,300 పౌండ్లు ఖర్చు చేస్తున్నారని, దీన్ని నెలకు 29,500 పౌండ్లకు తగ్గించేందుకు అంగీకరించారని తెలిపారు. అంటే... ప్రస్తుతం 10 రోజులకు చేస్తున్న ఖర్చుతో ఆయన నెలంతా గడపాల్సివుంటుంది.
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాలను మాల్యా ఉద్దేశపూర్వకంగానే ఎగ్గొడుతున్నారని ఆరోపించిన ఎస్బీఐ, గడచిన రెండు దశాబ్దాల్లో ఆయన రియల్ ఎస్టేట్, యాచెస్, స్కాచ్ విస్కీ, ఫార్ములా వన్, యునైటెడ్ బ్రేవరీస్, ఐపీఎల్ ఫ్రాంచైజీ ఇలా ఎన్నో వ్యాపారాలు చేసి, అత్యంత లగ్జరీ జీవితాన్ని అనుభవించారని, ఇప్పుడు కేసులను ఎదుర్కొంటూ కూడా అదే పని చేస్తున్నారని, ఆయనకు కింగ్ ఫిషర్ బీర్ యూరప్ నుంచి నెలనెలా 7500 పౌండ్ల ఆదాయం వస్తోందని ఎస్బీఐ ఆరోపించింది.