Andhra Pradesh: హైదరాబాద్ లో రూ.2 కోట్ల నగదు పట్టివేత.. ‘జయభేరి’ ఉద్యోగులపై కేసు!
- మాదాపూర్ లో ఈరోజు సోదాలు
- నగదు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలింపు
- అబ్దుల్లాపూర్ మెట్ లో మరో రూ.48 లక్షలు స్వాధీనం
సార్వత్రిక ఎన్నికల వేళ ఎక్కడ చూసినా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. తాజాగా తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో పోలీసులు ఈరోజు రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ లో ఈరోజు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, ఓ కారులో ఇద్దరు అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీలు చేపట్టారు. దీంతో రూ.2 కోట్ల నగదు బయటపడింది.
సరైన పత్రాలు లేకుండా భారీ మొత్తంలో నగదును తరలిస్తున్న శ్రీహరి, పండరి అనే ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా, వీరిద్దరూ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ‘జయభేరి’ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బును హైదరాబాద్ నుంచి రాజమండ్రిలోని ఆఫీసుకు తరలిస్తున్నట్లు వీరిద్దరూ విచారణలో తెలిపారు. మరోవైపు హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఓ బీఎండబ్ల్యూ కారులో రూ.48 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.