Andhra Pradesh: చంద్రబాబు ప్రకటించిన ప్రతీ స్కీంలోనూ ఓ స్కాం ఉంది!: జస్టిస్ ఈశ్వరయ్య
- హైటెక్ సిటీ పేరుతో బినామీలకు దోచిపెట్టారు
- అమరావతిలో భారీ కుంభకోణం జరిగింది
- బీసీలు జడ్జీలుగా అవసరం లేదని బాబు అన్నారు
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం గొప్ప పథకాలు ప్రవేశపెడితే, ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని జాతీయ బీసీ సంఘం మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య విమర్శించారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ పేరుతో చంద్రబాబు తన బినామీలకు వేల కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పెట్టిన ప్రతీ స్కీం(ప్రభుత్వ పథకం)లో ఓ స్కామ్(కుంభకోణం) ఉందని దుయ్యబట్టారు. తిరుపతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడారు.
అమరావతిలో రాజధాని పేరిట భారీ కుంభకోణం జరిగిందని జస్టిస్ ఈశ్వరయ్య ఆరోపించారు. చంద్రబాబు తొలుత ఈ ప్రాంతంలో తన బినామీలతో భూములు కొనుగోలు చేయించారనీ, ఆ తర్వాతే రాజధాని ప్రాంతం ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బీసీలను మోసం చేశారనీ, టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన బీసీ ప్లాన్ వట్టి బూటకమని వ్యాఖ్యానించారు.
బీసీలు న్యాయమూర్తులుగా అవసరంలేదని చంద్రబాబు లేఖ రాయడం దుర్మార్గమన్నారు. మరోవైపు జగన్ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. బీసీలకు జగన్ 41 ఎమ్మెల్యే, 7 లోక్ సభ సీట్లను కేటాయించారని గుర్తుచేశారు.