Andhra Pradesh: టీడీపీ ఎంపీ మురళీమోహన్ పై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు!
- ఈరోజు రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
- ఇద్దరు జయభేరి సంస్థ ఉద్యోగులు అదుపులోకి
- డబ్బును మురళీమోహన్ కు ఇచ్చేందుకు తీసుకెళుతున్నామన్న నిందితులు
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ లో 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. పోలీసుల తనిఖీల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు తమకు అనుమానాస్పదంగా కనిపించారనీ, దీంతో వారి వాహనంలో సోదాలు నిర్వహించామని అన్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జనార్ మాట్లాడారు.
ఈ నగదును తీసుకెళుతున్న వ్యక్తులను నిమ్మలూరి శ్రీహరి, పండరిగా గుర్తించామని తెలిపారు. వీరిద్దరూ జయభేరి కంపెనీలో పనిచేస్తున్నారన్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా రూ.2 కోట్ల నగదును రైలు ద్వారా తరలించేందుకు వీరు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు.
జయభేరీ సంస్థకు చెందిన ధర్మరాజు, జగన్మోహన్ ఈ డబ్బును టీడీపీ నేత మురళీ మోహన్ కు అందించాల్సిందిగా చెప్పినట్లు నిందితులు శ్రీహరి, పండరి అంగీకరించారన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ మురళీ మోహన్, యలమంచిలి మురళీకృష్ణ, జగన్మోహన్, ధర్మరాజు, పండరి, శ్రీహరిలపై కేసు నమోదు చేశామని సజ్జనార్ తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 171బీ, 171ఈ, 171సీ, 171 ఎఫ్ కింద కేసు నమోదు చేశామన్నారు.