Andhra Pradesh: టీడీపీ నేతలపై చర్యలు తీసుకోండి.. నెల్లూరు ఎస్పీకి వైసీపీ నేత, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఫిర్యాదు!
- ఎస్పీ ఐశ్వర్యా రస్తోగిని కలుసుకున్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే
- ఏడాదిన్నర క్రితం వీడియోను మార్ఫింగ్ చేశారని ఆగ్రహం
- నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
తాను ఏడాదిన్నర క్రితం చేసిన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై సోషల్ మీడియాలో, కొన్ని టీవీ ఛానళ్లలో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్యా రస్తోగీని కలిసి టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తనను రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ నేతలు ఇలాంటి దుష్ప్రచారానికి దిగుతున్నారని మండిపడ్డారు. ఏడాదిన్నర క్రితం వైసీపీ కార్యకర్తలతో జరిగిన ఓ సమావేశంలో ‘ఒక సైనికుడు యుద్ధానికి వెళ్లినప్పుడు తన చేతిలో రెండే ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. చనిపోవడమా లేదా శత్రువును చంపడమే. ఆ విధంగా ప్రతి కార్యకర్త ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలి’ అని మాత్రమే చెప్పానని అనిల్ అన్నారు. దీన్ని మార్ఫింగ్ చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.