Andhra Pradesh: అనిల్ పై వ్యాఖ్యలపై దుమారం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, టీవీ5పై నిప్పులు చెరిగిన జగన్!
- విద్యావ్యవస్థను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు
- అందుకు కారణం బాబు బినామీ మంత్రి నారాయణే
- నెల్లూరు బహిరంగ సభలో జగన్ ఘాటు వ్యాఖ్యలు
వైసీపీ నేత, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై వైసీపీ అధినేత జగన్ ఘాటుగా స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నెల్లూరులో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని వ్యవస్థల పరిస్థితిని ఒక్కసారి చూడమని ప్రజలను కోరుతున్నా. ఇక్కడే నా పక్కన మీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ఉన్నాడు. యువకుడు..సౌమ్యుడు.. మంచి వాడు. పేదల కోసం సొంత డబ్బును ఖర్చుపెట్టేవాడు. కానీ ఇలాంటి వ్యక్తిని ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, టీవీ5 అమ్ముడుపోయిన మీడియా వ్యవస్థ ఏమని చూపిస్తున్నాయి? అనిల్ ఏదో రాక్షసుడన్నట్టుగా ఓ పథకం, పద్ధతి ప్రకారం చిత్రీకరిస్తున్నాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో విద్యావ్యవస్థ తీరుతెన్నులపై కూడా జగన్ స్పందించారు. ‘ప్రతి జిల్లాలో యూనివర్సిటీ ఉండాలని వైఎస్సార్ సింహపురి యూనివర్సిటీని తీసుకొచ్చారు. ఏ ముఖ్యమంత్రి అయినా చదువులు బాగా చెప్పించాలని ఆలోచన చేయాలి.. కానీ చంద్రబాబు అక్షరాల 200 టీచర్ పోస్టులను ఖాళీగా పెట్టారు. అదే సింహపురి యూనివర్సిటీలో ఇప్పుడు అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఒక్కసారి రాష్ట్రంలోని చదువులపై ఆలోచన చేయమని కోరుతున్నా. పిల్లలను చదివించే కార్యక్రమాన్ని ప్రభుత్వం నుంచి మళ్లించి ప్రయివేటుపరం చేయాలని ఆరాటపడుతున్నారు.
కారణం బినామీగా ఉన్న మంత్రి నారాయణ స్కూళ్ల కోసం. ఎల్‌కేజీ చదవాలంటే వేలల్లో ఫీజుల వసూలు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇదే నారాయణ సంస్థలో పిల్లలు చనిపోతున్నారు. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. సాక్షాత్తూ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్లు పూర్తిగా లీకవుతున్నాయి. ఆ నారాయణ కాలేజీలో చేయని అన్యాయం ఉండదు. అటువంటి కాలేజీలకు సబంధించిన నారాయణ మాత్రం ఆహా ఓహో.. అని ఎంతటి గొప్ప వాడో అని ఈ అమ్ముడుపోయిన పత్రికలు రాస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో మార్పు కోసం వైసీపీకి ఓటేయాలని కోరారు.