Bollywood: సినిమా అవకాశాలు తగ్గడంతో గూగుల్ సంస్థలో ఉద్యోగినిగా చేరిన బాలీవుడ్ హీరోయిన్
- టాప్ ఎగ్జిక్యూటివ్ గా మయూరి కాంగో
- ఐఐటీ ఖరగ్ పూర్ లో విద్యాభ్యాసం
- పాపా కెహతే హై చిత్రంతో నటిగా గుర్తింపు
దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం హిందీ చిత్రరంగంలో అడుగుపెట్టిన మయూరి కాంగో ప్రస్థానం ఎంతో ఆసక్తికరం. నసీం అనే సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైన మయూరి ఆ తర్వాత పాపా కెహతే హై చిత్రంతో ఉత్తరాది ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అక్కడ్నించి అజయ్ దేవగణ్, బాబీ డియోల్, అర్షద్ వార్సీ తదితరులతో కలిసి అనేక చిత్రాల్లో నటించింది. కానీ, మయూరి కాంగో ఇతర హీరోయిన్లతో పోటీపడడంలో విఫలమై మరిన్ని అవకాశాలు దక్కించుకోలేకపోయింది. బుల్లితెరపై తన అదృష్టం పరీక్షించుకోవడానికి వెళ్లి కొన్ని సీరియళ్లలో నటించింది. ఈ సమయంలోనే ఆదిత్య థిల్లాన్ అనే వ్యక్తిని పెళ్లాడి వైవాహిక జీవితంలోకి ప్రవేశించింది.
మయూరి కాంగో దురదృష్టం ఏమిటో కానీ, టెలివిజన్ రంగంలో కూడా చాన్సులు తగ్గిపోయాయి. దాంతో, నటన తనకు అచ్చిరాదని భావించి చదువుపై దృష్టి పెట్టింది. ఆమె సినిమాల్లోకి రావడానికి ముందు ప్రతిష్ఠాత్మక ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి పట్టా పుచ్చుకుంది. వినోద రంగానికి గుడ్ బై చెప్పేసిన తర్వాత న్యూయార్క్ లో ఎంబీఏ ఫైనాన్స్ చదివింది. అక్కడే కొన్ని సంస్థల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించింది. అటుపై స్వదేశానికి చేరుకున్న మయూరి కాంగో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సంస్థలో టాప్ లెవల్ ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగం దొరకబుచ్చుకుంది. ప్రస్తుతం ఆమె గుర్ గావ్ లో నివాసం ఉంటోంది.