baala: బాలా తన బాధను మరిచిపోవడం కోసం ఛాన్స్ ఇచ్చిన సూర్య
- తమిళ దర్శకుల్లో బాలా స్థానం ప్రత్యేకం
- 'వర్మ' రీమేక్ తో జరిగిన అవమానం
- కృతజ్ఞతగా హెల్ప్ చేసిన సూర్య
తమిళంలో విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా 'బాలా'కి మంచి పేరుంది. కథాకథనాలను అల్లుకునే విషయంలోను .. పాత్రలను తీర్చిదిద్దే విషయంలోను ఆయన తనదైన ప్రత్యేకతను కనబరుస్తూ వుంటారు. 'సేతు' .. 'పితామనగన్' .. 'అవన్ ఇవన్' సినిమాలు దర్శకుడిగా బాలా గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాయి. అలాంటి బాలా .. త్వరలో సూర్యతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
దర్శకుడిగా బాలాకి ఒక సినిమా అవకాశం రావడం పెద్ద విషయమేం కాదు. కానీ 'అర్జున్ రెడ్డి' రీమేక్ గా ఆయన తెరకెక్కించిన 'వర్మ' సినిమాను ఆ నిర్మాతలు పక్కన పడేసిన తరువాత ఆయన చేయనున్న తొలి సినిమా సూర్యదే. 'వర్మ' సినిమా అవుట్ పుట్ పనికిరాదని చెత్తబుట్టలో పడేయడం .. బాలాను అవమాన పరచడమే. అయినా ఆయన ఈ విషయంపై రాద్ధాంతం చేయకుండా మౌనంగా వుండిపోయాడు. ఆయన మానసికంగా కుంగిపోకూడదనే సూర్య తన సినిమాను చేసే అవకాశాన్ని పిలిచి మరీ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. కెరియర్ ఆరంభంలో తనని నిలబెట్టినందుకు కృతజ్ఞతగా సూర్య ఇలా చేశాడని కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు.