chattisgaargh: ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల దుశ్చర్య.. నలుగురు బీఎస్ఎఫ్ జవాన్ల దుర్మరణం!
- లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దాడి
- ఇద్దరు జవాన్లకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు
- ఈ నెల 18న కాంకేర్ లోక్ సభ స్థానానికి ఎన్నికలు
లోక్ సభ ఎన్నికల వేళ ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతాబలగాలు లక్ష్యంగా మెరుపుదాడికి తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను సహచరులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లా మహ్లీ గ్రామానికి సమీపంలోని అటవీప్రాంతంలో మావోలు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందింది.
దీంతో 114వ బెటాలియన్ కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే జవాన్ల కదలికలను గుర్తించిన మావోలు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు అమరులు కాగా, ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన అధికారులు వెంటనే కూంబింగ్ ను ముమ్మరం చేశారు. కాంకేర్ లోక్ సభ నియోజకవర్గంలో ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి.