BJP: భావోద్వేగాల నడుమ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిన అద్వానీ
- గాంధీనగర్ ప్రజల ప్రేమ ఎంతో సంతోషాన్నిచ్చింది
- రాజకీయంగా విభేదించిన వారిని శత్రువులుగా చూడలేదు
- అలాంటివారిని జాతి వ్యతిరేకులుగా చిత్రీకరించలేదు
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఓ బ్లాగ్ లో తన సందేశం వెలిబుచ్చారు. అద్వానీ బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆరుసార్లు ఎంపీగా గెలిచిన ఆయనకు గాంధీనగర్ నియోజకవర్గం కంచుకోటలా నిలిచింది. అయితే, బీజేపీ ప్రస్తుత నాయకత్వం ఆయనకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేదు. అయినాగానీ ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయకుండా ఎంతో హుందాగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో, పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సందేశం ఇచ్చారు.
1991 నుంచి తన వెన్నంటి నిలిచిన గాంధీనగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రేమ అన్నివేళలా తనను ఎంతో సంతోషానికి గురిచేసిందని చెప్పారు. ఇక పార్టీ గురించి చెబుతూ, బీజేపీతో తనది సుదీర్ఘ అనుబంధమని గుర్తుచేసుకున్నారు. 14 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ లో చేరిన తాను ఆపై భారతీయ జనసంఘ్, బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించానని పేర్కొన్నారు. మొదటి నుంచి తాను ఒకే సిద్ధాంతాన్ని అనుసరించానని, 'పార్టీ మొదట, స్వప్రయోజనాలు చివరన' అనే సూత్రానికి కట్టుబడి ఇన్నాళ్లు రాజకీయ రంగంలో కొనసాగానని అన్నారు.
రాజకీయపరంగా తమతో విభేదించేవారిని ఎన్నడూ శత్రువులుగా చూడలేదని, అలాంటివాళ్లను జాతి వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేయలేదని స్పష్టం చేశారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే అనే ధోరణి వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో అద్వానీ వ్యాఖ్యలు బీజేపీ అంతర్గత వ్యవహారాలను ఎత్తిచూపుతున్నాయి!