Delhi Capitals: హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం.. టాప్ ప్లేస్‌లోకి సన్‌రైజర్స్

  • సొంత మైదానంలో చతికిలపడిన ఢిల్లీ
  • హైదరాబాద్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన బ్యాట్స్‌మెన్
  • అలవోక విజయాన్ని అందుకున్న హైదరాబాద్

ఐపీఎల్‌లో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అలవోక విజయాన్ని అందుకుంది. హైదరాబాద్‌కు ఇది వరుసగా మూడో విజయం కాగా, ఢిల్లీకి ఇది వరుసగా రెండో ఓటమి. ఈ విజయంతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించింది. మంచి రన్‌రేట్ కారణంగా అగ్రస్థానంలో నిలిచింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 14 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఓపెనర్ పృథ్వీషా (11) బౌల్డయ్యాడు. ఇక ఆ తర్వాత కూడా ఢిల్లీ వికెట్ల పతనం కొనసాగింది. హైదరాబాద్ బౌలర్ల పదునైన బంతులకు బ్యాట్స్‌మెన్ ఎదురు నిలవలేకపోయారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఒక్కడే ఎదురొడ్డి నిలిచాడు. 41 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 43 పరుగులు చేశాడు. చివర్లో అక్షర్ పటేల్ 13 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో 23 పరుగులు చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 129 పరుగులు చేసి హైదరాబాద్ ముందు స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది.

అనంతరం 130 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ బెయిర్‌స్టో 28 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో 48 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్‌ను గెలిపించిన అతడికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా, ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడి ఒక్క విజయం కోసం పరితపించి పోతున్న బెంగళూరు జట్టు నేడు కోల్‌కతాతో తలపడనుంది.

  • Loading...

More Telugu News