Ravichandran Ashwin: నేనేమీ తప్పు చేయలేదు.. పశ్చాత్తాపం లేదు: రవిచంద్రన్ అశ్విన్
- జోస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా అవుట్ చేసిన అశ్విన్
- తన చర్యలను సమర్థించుకున్న అశ్విన్
- తానేమీ చట్ట విరుద్ధంగా ప్రవర్తించలేదన్న పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్లో జోస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా అవుట్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. చిన్నపిల్లాడి ఆటలంటూ క్రీడా విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోశారు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడంటూ అశ్విన్‌పై మండిపడ్డారు.
అయితే, అశ్విన్ మాత్రం మన్కడింగ్‌ను సమర్థించుకున్నాడు. తాను చట్టవిరుద్ధంగా ఏమీ ప్రవర్తించలేదన్న విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఈ విషయంలో తనకు ఎటువంటి పశ్చాత్తాపం లేదన్నాడు. జట్టు సభ్యులు తనతో ఉన్నారని, చాలామంది ఆటగాళ్లు తనను సమర్థించారని గుర్తు చేశాడు. ‘‘నేను చేసింది ముమ్మాటికీ సరైనదే’’ అని అశ్విన్ స్పష్టం చేశాడు. మన్కడింగ్ వివాద ప్రభావం తనపై పడబోదని అశ్విన్ పేర్కొన్నాడు. ఈ వివాదంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ సహచర ఆటగాడి తరపున నిలబడ్డారని, మన ఆటగాళ్లు తన తరపున నిలబడ్డారని, ఇది సంతోషించదగ్గ విషయమేనని అశ్విన్ పేర్కొన్నాడు.