Andhra Pradesh: జగన్ కు ఈసారి ఓటేస్తే ఏపీ ఉగాండాగా మారుతుంది!: టీడీపీ నేత సీఎం రమేశ్ హెచ్చరిక
- సీఎం రమేశ్, ఆయన అనుచరుల ఇంట్లో సోదాలు
- ఈసీ ఆదేశాలతో ఏపీ పోలీసుల తనిఖీలు
- తీవ్రంగా మండిపడ్డ టీడీపీ నేత
టీడీపీ నేత సీఎం రమేశ్ తో పాటు ఆయన అనుచరులు, మద్దతుదారుల ఇళ్లపై పోలీసులు ఈరోజు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం రమేశ్ ఈరోజు తీవ్రంగా స్పందించారు. ఈరోజు ఉదయం 6 గంటలకే పోలీస్ అధికారులు తమ ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారని రమేశ్ తెలిపారు. ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశాలతో ఈ తనిఖీలు చేపట్టారని వ్యాఖ్యానించారు. ఈ సోదాలు ఓ గంట సేపు సాగాయనీ, ఈ సందర్భంగా తమ పొరుగిళ్లలోనూ తనిఖీలు చేపట్టారని పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అనేది విజయసాయిరెడ్డి సంస్థగా కనిపిస్తోందని సీఎం రమేశ్ విమర్శించారు. ప్రధాని మోదీ కనుసన్నల్లోనే ఈసీ పనిచేస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో టీడీపీ నేతల దృష్టిని మళ్లించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా జగన్ కు సానుభూతి వచ్చేందుకు పన్నాగాలు పన్నుతున్నారని విమర్శించారు.
జగన్ లాంటి వ్యక్తికి ఈసారి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ ఉగాండాగా మారుతుందని హెచ్చరించారు. ఎన్నిదాడులు చేసినా తాము భయపడబోమని స్పష్టం చేశారు. అసలు సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేస్తారని ప్రశ్నించారు. గతంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఆయనపై కూడా ఐటీ దాడులు చేయించారని గుర్తుచేశారు.