Andhra Pradesh: ప్రజలపై నోట్లను వెదజల్లిన వైసీపీ నేతలు.. ఘాటుగా స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు!
- అహంకారంతోనే వైసీపీ నేతల చర్యలు
- కేసీఆర్, మోదీ పంపిన డబ్బులతో వైసీపీ పేట్రేగుతోంది
- అమరావతిలో టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలు ప్రజలపై నగదును వెదజల్లిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలు అహంభావంతోనే డబ్బులు వెదజల్లుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్, మోదీ పంపిన డబ్బు సంచులతో వైసీపీ పేట్రేగుతోందని దుయ్యబట్టారు. అమరావతిలో టీడీపీ నేతలతో ఈరోజు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడారు.
టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని ఏపీలో ఐటీ దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ వైసీపీ, టీఆర్ఎస్ నేతలపై మాత్రం దాడులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. పాంప్లెట్ల పంపిణీ ముసుగులో కూపన్లు అందిస్తున్నారని, కూపన్లు తీసుకెళ్తే 2రోజుల్లో నగదు ఇస్తామని ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
టీడీపీలోని ప్రతీ కార్యకర్త ఓ ఎన్టీఆర్, ఓ చంద్రబాబేనని ఏపీ సీఎం స్పష్టం చేశారు. 65లక్షల మంది ఎన్టీఆర్లను, చంద్రబాబులను ఎదుర్కోవడం ఎవ్వరి తరం కాదని తేల్చిచెప్పారు. ఆర్థిక లోటుతో సతమతం అవుతున్నప్పటికీ ఉద్యోగులు కోరిన డిమాండ్లన్నీ నెరవేర్చామని తెలిపారు. ఇప్పుడు టీడీపీ గెలుపును మీ గెలుపుగా తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.