Telangana: టీఆర్ఎస్ లో చేరబోతున్నా.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు అండగా ఉంటా!: టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావు
- టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి నచ్చాయి
- కేసీఆర్ తో పనిచేయాలని నిర్ణయించుకున్నాను
- నిజామాబాద్ సీటు కోసం కేసీఆర్ వ్యూహాత్మక అడుగు
తెలంగాణ టీడీపీ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. తాను త్వరలోనే టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాను అండగా ఉంటానని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి కోసం టీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు మండవ వెంకటేశ్వరరావు అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు మండవ వెంకటేశ్వరరావు ఇంటికి స్వయంగా వెళ్లిన సంగతి తెలసిందే. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లో చేరాలని కేసీఆర్ కోరగా, ఆయన ఇందుకు సానుకూలంగా స్పందించారు. మండవ వెంకటేశ్వరరావు ఇప్పటివరకూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా, చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు.
తాజాగా లోక్ సభ ఎన్నికల్లో భాగంగా పలువురు నిజామాబాద్ రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర దక్కనందుకు నిరసనగా వారంతా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రైతుల నిర్ణయం టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు ప్రతికూలంగా మారవచ్చన్న ఉద్దేశంతోనే కేసీఆర్ మండవను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ లో మండవ వెంకటేశ్వరరావుకు గట్టి పట్టున్న నేపథ్యంలో పార్టీకి లబ్ధి చేకూరుతుందని కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.