Jagan: ఫోన్ కొడితే మంచినీళ్లు తెస్తారో లేదో నాకు తెలియదు కానీ, మందుబాటిల్ ఇంటికే తెచ్చిస్తున్నారు: విజయవాడలో జగన్ ఫైర్
- ప్రజలకు ఏం చేశారు?
- ఐదేళ్ల పాలనలో న్యాయం జరిగిందా?
- చంద్రబాబుపై విరుచుకుపడిన వైసీపీ అధినేత
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎంతో పవిత్రమైన దుర్గగుడిలో తాంత్రిక పూజలు నిర్వహించారంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఐదేళ్లుగా అటు రాజధాని అమరావతి, ఇటు విజయవాడలో దుర్గగుడి పేరు చెబుతూ చంద్రబాబునాయుడు మాయాబజార్ సినిమా చూపిస్తున్నాడని మండిపడ్డారు.
విజయవాడలో దుర్గగుడి సమీపంలో ఫ్లైఓవర్ నిర్మిస్తామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని, అమరావతిలో ఇప్పటివరకు ఒక్క పని కూడా జరగలేదని, అన్నీ టెంపరరీ పనులే అని విమర్శించారు. శాశ్వత నిర్మాణాలకు ఒక్క ఇటుక కూడా వేయలేదని అన్నారు. రాజధాని గురించి అడిగితే బాహుబలి సినిమా చూశారా? అంటూ అడుగుతారని ఆరోపించారు.
"విజయవాడలో తాగునీరు ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. 40 వేల మంది ఇళ్లు లేక అలమటిస్తున్నారు. ఇదీ ఈ పెద్దమనిషి చంద్రబాబు గారి పరిపాలన. 40 వేలమంది ఇళ్లు ఇవ్వమని ఐదేళ్లుగా అడుగుతుంటే చంద్రబాబు ఏమైనా గాడిదలు కాస్తున్నాడా? విజయవాడలో వీధికొక మందు షాపు కనిపిస్తోంది. విజయవాడలో మంచి నీళ్లు అడిగితే తెస్తారో లేదో కానీ, మందు బాటిల్ అడిగితే నేరుగా ఇంటికే తెచ్చి పరిస్థితి కనిపిస్తోంది" అంటూ విమర్శల వర్షం కురిపించారు.