Kumaraswami: సీఎం వాహనాన్ని ఆపి తనిఖీలు చేయడం ఎక్కడైనా ఉందా?: కుమారస్వామి ఆవేదన
- ఈసీ నాపై కక్ష కట్టింది
- నన్ను హింసిస్తున్నారు
- మమ్మల్నే లక్ష్యంగా చేసుకున్నారు
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓ సీఎం వాహనాన్ని ఆపి తనిఖీలు చేయడం ఎక్కడైనా ఉందా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిరోజుల క్రితం బెంగళూరు నుంచి హసన్ వెళుతున్నప్పుడు ఓ చెక్ పోస్ట్ వద్ద నిఘా విభాగం అధికారులు కుమారస్వామి కారును ఆపి తనిఖీలు చేయడం తీవ్ర కలకం సృష్టించింది. ఈ పరిణామంతో సీఎం కుమారస్వామి మనస్తాపం చెందారు.
ఎన్నికల సంఘం తన పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, తమనే లక్ష్యంగా చేసుకుందని అన్నారు. ఇప్పుడు తన కారును ఆపారని, కొన్నిరోజుల కిందట తన సంబంధీకుల నివాసంలో సోదాలు జరిపారని తెలిపారు. ఈసీ చర్యలు తనను హింసించే విధంగా ఉన్నాయని ఆయన వాపోయారు. కాన్వాయ్ లు ఆపి మరీ తనిఖీలు నిర్వహించడం చూస్తుంటే తమను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లేక ఇలాంటి మార్గాలను ఎంచుకున్నారంటూ విమర్శించారు.