Ugadi: తెలుగు లోగిళ్లలో వెల్లివిరుస్తున్న ఉగాది వేడుకలు!
- షడ్రుచుల మేళవింపైన ఉగాది పచ్చడి
- పంచాంగ శ్రవణం వినేందుకు ఆసక్తి
- శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
తెలుగు రాష్ట్రాల్లో వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాదిని జరుపుకోవడం ఆనవాయితీ. పురుషులు, స్త్రీలు, చిన్నారులు అనే తారతమ్యం లేకుండా, ఉదయాన్నే లేచి, తలంటి స్నానాలు చేసి, షడ్రుచుల మేళవింపైన ఉగాది పచ్చడిని చేసి, దేవునికి నైవేద్యం పెట్టి, వసంతరుతువులో వచ్చే వ్యాధులను తట్టుకునే శక్తి శరీరానికి కలిగేలా, ఆ పచ్చడిని ప్రసాదంగా తీసుకుంటారన్న సంగతి తెలిసిందే.
సంవత్సరానికి ప్రారంభమైన తొలి రోజున జన్మనక్షత్రం రీత్యా రాశి ఫలాలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. పంచాంగ శ్రవణం విని, పంటలెలా పండుతాయి? వర్షాలు ఏ విధంగా ఉంటాయి? నవగ్రహాల ప్రభావం కొత్త సంవత్సరంలో తమ జీవితాలపై ఎలా ఉంటుందన్న వివరాలను పంచాంగకర్తల నుంచి వింటారు.
కాగా, తెలుగురాష్ట్రాల్లోని దేవాలయాలు నేడు కిక్కిరిసిపోయాయి. తిరుమల భక్తులతో పోటెత్తుతోంది. విజయవాడ, సింహాచలం, శ్రీశైలం, అన్నవరం, యాదగిరిగుట్ట, వేములవాడ, బాసర తదితర ప్రాంతాల్లోని ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజలకు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో పాటు వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ తదితరులు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.