Andhra Pradesh: ముఖ్యమంత్రిగా ఉండి ధర్నా చేయడం సిగ్గనిపించడం లేదా చంద్రబాబూ!: విజయసాయిరెడ్డి
- రాష్ట్రమంతా అట్టుడికిపోవాలని పిలుపునిస్తారా?
- మీ వాలకం చూస్తుంటే పోలింగును కూడా అడ్డుకునేట్లు ఉన్నారు
- చంద్రబాబు యూటర్నుల అలవాటు పవన్ కు వచ్చింది.
వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఓ ముఖ్యమంత్రిగా ఉండీ కేంద్ర సంస్థలకు వ్యతిరేకంగా ధర్నా చేయడం సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘సీఎంగా ఉండి కేంద్ర సంస్థలకు వ్యతిరేకంగా ధర్నాచేయడం షేమ్ అనిపించడం లేదా చంద్రబాబూ.. రాష్ట్రమంతా అట్టుడికి పోవాలని పిలుపునిస్తారా? ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించమనే గదా? మీ వాలకం చూస్తుంటే పోలింగును కూడా అడ్డుకునేలా ఉన్నారు. ఆరి(ఓడి) పోయే దీపం రెపరెపలాడినట్లు ఉన్నాయి మీ చేష్టలు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించినప్పటి నుంచి తనపై అంతా కుట్రలు పన్నుతున్నారని విలపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. నిన్నటివరకూ మేనేజ్ చేసిన వ్యవస్థలన్నీ ఇప్పుడు తనకే అడ్డం తిరిగాయని బాధపడుతున్నారని దుయ్యబట్టారు.
ఇదే సందర్భంగా పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘ఆర్నెల్లు స్నేహం చేస్తే వారు వీరవడం అంటే ఇదేనేమో. చంద్రబాబు యూ-టర్నుల అలవాటు ఆయన పార్టనర్‌కు వచ్చింది. మొన్నేమో తెలంగాణలో ఆంధ్రా వాళ్లని కొట్టి తరుముతున్నారని అన్నాడు. ఇప్పుడేమో తెలంగాణలో పుట్టనందుకు బాధపడుతున్నారట. ఆంధ్రాలో జన్మించి దురదృష్టువంతుడయ్యాడట’ అని విమర్శించారు.