Guntur District: టీడీపీలోకి మరో మాజీ ఎమ్మెల్యే వీరపనేని...కొనసాగుతున్న రాజకీయ వలసలు
- ఉండవల్లిలో బాబు సమక్షంలో చేరిన యలమందరావు
- పసుపుకండువా వేసి ఆహ్వానించిన సీఎం
- రాయపాటి, ఆంజనేయులు గెలుపుకోసం పనిచేస్తానని స్పష్టీకరణ
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వీరపనేని యలమందరావు తెలుగుదేశం పార్టీలో చేరారు. నిన్న ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన మెడలో పసుపుకండువా వేసి స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, ఎంపీ రాయపాటి సాంబశివరావు దౌత్యంతో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వీరపనేని వినుకొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు టీడీపీ మద్దతు ఇవ్వడంతో గెలుపొందారు. 1999లో టీడీపీ టికెట్టుపైనే పోటీచేసి మరోసారి గెలిచారు. ఆ తర్వాత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ సందర్భంగా వీరపనేని మాట్లాడుతూ కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న తాను మళ్లీ సొంతింటికి వచ్చినట్లు భావిస్తున్నానని, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు రాయపాటి సాంబశివరావు, జి.వి.ఆంజనేయుల విజయానికి కృషి చేస్తానని తెలిపారు.