Sharad Pawar: వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మోదీ కొత్త టెక్నిక్‌లు: శరద్ పవార్
- టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది కాంగ్రెస్సే
- రాజీవ్ గాంధీ వల్లే నేడు అందరూ మొబైల్స్ వాడుతున్నారు
- డీమోనిటైజేషన్ వల్ల 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు
ప్రధాని నరేంద్రమోదీపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చాలా టెక్నిక్స్ వాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటర్లను దూరం చేయడానికి గాంధీ కుటుంబాన్ని విమర్శించడం తప్ప ఈ ఐదేళ్లలో మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. నేడు దేశంలో కోట్లాదిమంది మొబైల్ ఫోన్లు వాడుతున్నారంటే అది రాజీవ్ గాంధీ పుణ్యమేనన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో టెలికం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన సాంకేతికత లక్షలాదిమంది జీవితాలను మార్చివేసిందన్నారు.
అమరుడయ్యే ప్రతీ భారత జవానుకు ప్రతిగా పదిమంది పాకిస్థాన్ జవాన్లను హతమారుస్తామని డాంబికాలు పలికిన మోదీ ఇప్పుడు చేష్టలుడిగి చూస్తున్నారని దుయ్యబట్టారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ జవాన్లు యథేచ్ఛగా కాల్పులు జరుపుతున్నారని, ఈ కాల్పుల్లో 693 మంది సైనికులు అమరులయ్యారని పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు కారణంగా మహారాష్ట్రలో 100 మంది ఏటీఎంల వద్ద క్యూల్లో నిల్చుని చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీమోనిటైజేషన్ వల్ల 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆరోపించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చేసిన హామీని మోదీ తుంగలో తొక్కారని శరద్ పవార్ మండిపడ్డారు.