sivaji: చంద్రబాబు హయాంలో ఏపీకి కంపెనీలు వచ్చాయన్నది నిజం కాదా?: శివాజీ మరో వీడియో
- తిరుపతిలోని శ్రీసిటీని సందర్శించిన శివాజీ
- అక్కడి ఉద్యోగులతో మాటా మంతీ
- ఏపీకి పరిశ్రమలు వచ్చాయన్నది నిజమేనన్న శివాజీ
విజయవాడలో విలేకరులతో మాట్లాడుతున్న సినీ నటుడు శివాజీ ఇప్పటికే పోలవరం, అమరావతి నిర్మాణాలను సందర్శించిన వీడియోలను ప్రదర్శించి వాటిపై వస్తున్న విమర్శలకు సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత ఏపీకి పరిశ్రమలు రాలేదన్న విమర్శలకు సమాధానంగా మరో వీడియోను ప్రదర్శించారు. ఇందులో భాగంగా శ్రీసిటీని సందర్శించారు. ఫాక్స్‌కాన్ మొబైల్ మాన్యుఫ్యాక్టరీ సందర్శించిన శివాజీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడ 15 వేల మంది అమ్మాయిలు పనిచేస్తున్నట్టు చెప్పారు. మహిళా సాధికారతకు ఇది నిదర్శమని చెప్పారు. కంపెనీలు రావడం అన్నది నిజమని పేర్కొన్నారు.
తర్వాత మరో జపాన్ కంపెనీ, ఇసుజు కార్ల కంపెనీని సందర్శించారు. తర్వాత ఆల్స్టామ్ మెట్రో కోచ్ కంపెనీని చూపించారు. ఎన్‌హెచ్‌కే ఆటోమొబైల్ కంపెనీ, మామీ పోకో డైపర్స్ కంపెనీ, యునీ చామ్, తర్వాత నోలా అండ్ డోలా, ఎంఎండీ హెవీ మిషనరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, థెమాక్స్, పెప్సీ వంటి కంపెనీలను సందర్శించి చూపించారు. వీటన్నింటిలోనూ వేలాదిమంది పనిచేస్తున్నారని శివాజీ వివరించారు. శ్రీసిటీకి మొత్తం 90 కంపెనీలు వచ్చినట్టు తెలిపారు. మొత్తంగా 40 వేల మంది పనిచేస్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత తిరుపతిలోని ఎలక్ట్రానిక్ క్లస్టర్‌ను సందర్శించారు. అక్కడి కార్బన్ కంపెనీని సందర్శించి చూపించారు. ఇలా శ్రీ సిటీలోని అన్ని కంపెనీలను తిరిగి చూపించారు. మొత్తంగా ఏపీకి పరిశ్రమలు వచ్చాయన్నది నిజమని, అందులో 40 వేల మంది పనిచేస్తున్నారన్నది కూడా నిజమని పేర్కొన్నారు.