Andhra Pradesh: దమ్ముంటే ఆ ఆడియోను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపండి.. నిజమేంటో 2 గంటల్లో తేలిపోతుంది!: విజయసాయిరెడ్డి సవాల్
- టీడీపీ మేనిఫెస్టో కామిక్ పుస్తకంలా ఉంది
- నిరుద్యోగులు వలస వెళ్లేలా చంద్రబాబు చేశారు
- అంగన్ వాడీల విషయంలో కూడా అబద్ధం చెప్పారు
- ఏపీ సీఎంపై మండిపడ్డ వైసీపీ నేత
టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో కామిక్ పుస్తకంలా ఉందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. గతంలో ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అద్దంలో చందమామలను చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా నిరుద్యోగులు వలస వెళ్లేలా చంద్రబాబు చేశాడన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు.
ఏపీలో అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాల విషయంలో ఏపీ ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని విజయసాయిరెడ్డి అన్నారు. ‘రాష్ట్రంలోని అంగన్ వాడీలు అన్నింటికీ సొంత భవనాలు కట్టేశామని మీ తనయుడు లోకేశ్ చెప్పినవి పచ్చి అబద్ధాలన్నట్టేగా? 15,358 అంగన్ వాడీ కేంద్రాలకు బిల్డింగులు కడతామని మ్యానిఫెస్టోలో పెట్టారు. నర్సరీ, ప్రీప్రైమరీ స్కూళ్లన్నీ బోగస్. 1995 నుంచి చెప్పిన కథలే రిపీట్ చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
ఇక తాను మాట్లాడినట్లు మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియో టేపుపై విజయసాయిరెడ్డి మరోసారి స్పందించారు. ‘ఫేక్ ఆడియోలు, వీడియోలు ఇంకో 4 రోజులు ఇలాగే వదులుతారు. ప్రజల ఉమ్మిలో కొట్టుకుపోతూ గడ్డిపోచ పట్టుకుని ఎదురీదాలని చూస్తున్నారు. అన్నిటికీ దిగజారిన వ్యక్తులు మా వ్యక్తిత్వాలపై బురదజల్లడం ఊహించిందే. దమ్ముంటే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపండి. 2 గంటల్లో తేలుతుంది నిజమైనదో కాదో?’ అని సవాల్ విసరారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.