Pawan Kalyan: వెంట ఉంటామన్న డాక్టర్లు.. సున్నితంగా తిరస్కరించిన పవన్!
- చేతికి సెలైన్ సూదితోనే ప్రచారం
- గతరాత్రి తెనాలి రోడ్ షోకి హాజరు
- అనకాపల్లి, పెందుర్తి సభలకు పవన్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చివరి అంకంలో అనూహ్యరీతిలో అస్వస్థతకు గురయ్యారు. రెండ్రోజుల క్రితం పవన్ గన్నవరం ఎయిర్ పోర్టులో అస్వస్థతకు గురికావడం తెలసిందే. ఆయనకు విశ్రాంతి అవసరమని చికిత్స అందించిన డాక్టర్లు చెప్పినా పట్టించుకోకుండా తెనాలి రోడ్ షోకు వెళ్లారు. ఆ సమయంలో పవన్ చేతికి సెలైన్ ఎక్కించే సూది అలాగే ఉండడం ఆయన ఇంకా కోలుకోలేదన్న విషయాన్ని వెల్లడి చేస్తోంది.
పవన్ కు చికిత్స అందిస్తున్న డాక్టర్లు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రచారానికి వెళ్లొద్దని సూచించారు. జనసేనాని నీరసంగా ఉండడంతో సాధ్యమైనంత వరకు ఎండ బారిన పడకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. అయితే, ఈ నెల 11న పోలింగ్ ఉండడంతో మరికొన్ని రోజుల్లోనే ప్రచారం ముగియనుంది. దాంతో, సమయం తక్కువగా ఉండడం ఓవైపు, తాను వెళ్లాల్సిన నియోజకవర్గాలు ఇంకా మిగిలున్నందున పవన్ కల్యాణ్ ప్రచారానికే మొగ్గుచూపారు.
విశ్రాంతి తీసుకోకుండా గతరాత్రి తెనాలి రోడ్ షోలో పాల్గొన్న పవన్, తాజాగా అనకాపల్లి, పెందుర్తి సభల్లో పాల్గొనేందుకు వస్తున్నారు. అయితే, ప్రచారం సమయంలో తాము కూడా వెంట ఉంటామని డాక్టర్లు తెలుపగా, పవన్ సున్నితంగా తిరస్కరించారట.