Andhra Pradesh: ఈ పచ్చ మీడియా కలరా, ప్లేగు, ఎబోలా వైరస్ కంటే డేంజర్!: విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
- నిష్పాక్షిక ఎన్నికలు జరగవనే సీఎస్ ను తప్పించారు
- ఏబీ వెంకటేశ్వరరావుపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది
- కానీ పచ్చ మీడియా సానుభూతి కథనాలు ప్రచురించింది
ఆంధ్రప్రదేశ్ లో కొన్ని మీడియా సంస్థలపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించలేరన్న కారణంతోనే ఆంధ్రప్రదేశ్ సీఎస్ పునేఠాను కేంద్ర ఎన్నికల సంఘం తప్పించిందని విజయసాయిరెడ్డి తెలిపారు.
ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసిందని వ్యాఖ్యానించారు. అయితే ఎల్లో మీడియా మాత్రం ఈ నిజాలను దాచి ‘సీఎస్ ఆకస్మిక బదిలీ’ అని సానుభూతి కథనాలు రాసిందని దుయ్యబట్టారు. ఈ పచ్చమీడియా కలరా, ప్లేగు, ఎబోలా వైరస్ కంటే ప్రమాదకరమైనదని విమర్శించారు.
ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘సీఎస్ పునేఠా ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించలేరని ఈసీ పక్కకు తప్పించింది. ఏబీ వెంకటేశ్వరరావు కేసులో సీఎస్‌పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్లో మీడియా నిజాలు దాచి సీఎస్ ఆకస్మిక బదిలీ అని సానుభూతి రాతలు రాసింది. పచ్చ మీడియా...కలరా, ప్లేగు, ఎబోలా వైరస్ కంటే డేంజర్’ అని ట్వీట్ చేశారు.