Urmila: ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఊర్మిళా మతోండ్కర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
- ఊర్మిళ నోరుజారింది!
- హిందూ మతాన్ని కించపర్చిందంటూ ఆరోపణ
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి
బాలీవుడ్ చిత్రాలతో పాటు అనేక ప్రాంతీయ భాషల్లోనూ నటించి, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఊర్మిళా మతోండ్కర్ చిక్కుల్లో పడ్డారు. ఆమె ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, ఆమె హిందూ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సురేష్ నఖువా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను టీవీలో ఊర్మిళ ప్రసంగం వింటూ ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల దిగ్భ్రాంతికి గురయ్యానని సురేష్ తెలిపారు.
హిందుత్వం ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకర మతం అంటూ ఊర్మిళ అనడం దేశవ్యాప్తంగా ఉన్న హిందువులను కించపర్చడమేనని సురేష్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు హిందువులను ఉగ్రవాదులుగా చూస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఐపీసీ సెక్షన్ 295ఏ, సెక్షన్ 505, సెక్షన్ 34 కింద ఊర్మిళపై కేసు నమోదైంది.
అంతేకాదు, సురేష్ నఖువా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపైనా, ఊర్మిళ వ్యాఖ్యలను ఖండించకుండా అనుమతించిన టీవీ చానల్ యాంకర్ పైనా ఫిర్యాదు చేశారు. హిందుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసేలా కాంగ్రెస్ నేతలను రాహుల్ ప్రోత్సహిస్తున్నారని, ఊర్మిళ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం చెప్పకపోవడం ద్వారా టీవీ చానల్ యాంకర్ సమ్మతి తెలిపినట్టయిందని సురేష్ పేర్కొన్నారు.