Bjp: బీజేపీతో పొత్తు ఉంటే జగన్ పై ఉన్న కేసులన్నీ మాఫీ చేయించుకునే వారు కాదా?: వైఎస్ షర్మిళ
- బీజేపీతో వైసీపీ పొత్తు వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం
- పొత్తుల కోసం ఎప్పుడూ వెంపర్లాడేది చంద్రబాబే
- ఏ పార్టీ తోనూ జగన్ పొత్తు పెట్టుకోలేదు
బీజేపీతో వైసీపీకి పొత్తు ఉందంటూ వస్తున్న వ్యాఖ్యలను వైసీపీ మహిళా నేత వైఎస్ షర్మిళ ఖండించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, బీజేపీతో తమ పార్టీకి పొత్తే కనుక ఉంటే తనపై ఉన్న కేసులన్నింటినీ జగన్ మాఫీ చేయించుకునే వారు కాదా? అని ప్రశ్నించారు. బీజేపీతో వైసీపీ పొత్తు ఉందన్న వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు.
అదేవిధంగా, టీఆర్ఎస్ తో వైసీపీకి పొత్తు గురించి ఆమె మాట్లాడుతూ, ఆ పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడింది చంద్రబాబు అని, నందమూరి హరికృష్ణ భౌతికకాయం పక్కనే ఉన్న సమయంలో టీఆర్ఎస్ తో పొత్తు కోసం మాట్లాడింది చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. వైసీపీకి బీజేపీ, టీఆర్ఎస్ తో పొత్తు ఉంది అని చంద్రబాబు అంటే నిజం అయిపోతుందా? అని ప్రశ్నించారు.
పొత్తుల కోసం ఎప్పుడూ వెంపర్లాడేది చంద్రబాబేనని, నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ మోహన్ రెడ్డి సింగిల్ గానే బయటకొచ్చారని, వైసీపీని ఏర్పాటు చేసింది కూడా సింగిల్ గానే అని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు.